PM Surya Ghar Yojana 2025 – కొత్త నిబంధనలు, సబ్సిడీ వివరాలు, లాభాలు…
PM Surya Ghar Yojana 2025 దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆశీర్వాదంగా మారింది. ఈ పథకం ద్వారా రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకుని నెల నెలా ఉచిత విద్యుత్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ పథకం కింద సంవత్సరానికి రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి మాత్రమే సబ్సిడీ అందించేవారు. తాజాగా ప్రభుత్వం ఈ ఆదాయ పరిమితిని ఎత్తివేయడంతో ఇప్పుడు సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ PM Surya Ghar Yojana ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా నిబంధనలను మరింత సడలించాయి. ఇంతకు ముందు ఒక జిల్లా పరిధిలో ఉన్న ఇల్లుపైనే సోలార్ ఏర్పాటు చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా సొంత ఇల్లు, స్థలం ఉంటే అక్కడ సోలార్ ఏర్పాటు చేసి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగదారుడు నగరంలోని తన ఫ్లాట్ లేదా ఇంటిలో లింక్ చేసుకుని వాడుకునేలా అవకాశం కల్పించారు. ఉదాహరణకు విశాఖలో ఫ్లాట్‌లో ఉంటూ శ్రీకాకుళం లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో సొంత స్థలం ఉన్నవారు అక్కడ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ విద్యుత్‌ను తమ విశాఖ ఫ్లాట్‌లో ఉపయోగించుకోవచ్చు. యజమాని ఒకరే కావడంతో ఈ లింక్ సౌకర్యం సులభంగా అమలవుతుంది.
మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి సుమారు రూ.1.8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒక కిలోవాట్ ఏర్పాటు చేయడానికి రూ.60 వేల ఖర్చు అవుతుంది. ఇందులో సగం మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేల వరకు సబ్సిడీ వస్తుంది. మూడు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తే రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఒక కిలోవాట్ ద్వారా రోజుకు సగటున నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే నెలకు 120 యూనిట్లు ఉచిత విద్యుత్ లభిస్తుంది. మూడు కిలోవాట్లకు నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది సాధారణ వినియోగదారులకు సరిపడే పరిమాణం.
ఈ PM Surya Ghar Yojana ప్రత్యేకత ఏమిటంటే కేవలం రూ.1,000 డౌన్ పేమెంట్‌తోనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఐదు సంవత్సరాలపాటు EMIలు చెల్లిస్తే రుణం పూర్తవుతుంది. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ జీవిత కాలం 25 సంవత్సరాలు. అంటే ఐదేళ్ల తర్వాత మిగిలిన 20 సంవత్సరాలు వినియోగదారుడు పూర్తిగా ఉచిత విద్యుత్ పొందగలడు. దీని వల్ల నెల నెలా చెల్లించే విద్యుత్ బిల్లులు తగ్గి ఆర్థికంగా ఆదా అవుతుంది. అదే సమయంలో పర్యావరణానికి మేలు జరుగుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కనీసం పది వేల మందికి ఈ పథకం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు డిస్కమ్ పరిధిలో 1,16,000 మందికి పైగా నమోదు చేసుకున్నారు. 23,000 మందికి పైగా రూఫ్ టాప్ సోలార్ అమర్చారు. ఇంకా వేలాది మంది ఇనస్టాలేషన్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ మరింత మంది దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. PM Surya Ghar Yojana పథకం ద్వారా ప్రతి కుటుంబం నెలసరి విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది.